విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరు మళ్ళీ మారనుంది. గత ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టింది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తాజాగా, ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించారు.
ఇందుకు సంబంధించిన బిల్లును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో గవర్నర్ సంతకంతో చట్టంగా మారనుంది.
ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మారుస్తూ జగన్ ప్రభుత్వం 2022లో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీర్మానం చేయగా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.
పేరు మార్పు చర్యను అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీతో పాటు జనసేన, ఇతర పార్టీలు ఖండించాయి. తాము అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరును పునరుద్ధరిస్తామని వెల్లడించారు.