కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారందరికీ ఒక నెల వేతనాన్ని అదనంగా ఇస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ మొత్తాన్ని ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్‌గా ఇవ్వడం జరుగుతుందని మంత్రి వివరించారు.
‘‘ఈ పథకం అన్ని రంగాల్లోనూ ప్రవేశించే అందరికీ వర్తిస్తుంది. దీనివల్ల 2కోట్ల 10లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుంది’’ అని నిర్మలా సీతారామన్ తెలియజేసారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ఆశించినన్ని స్థానాలు దక్కించుకోలేకపోవడానికి కారణాల్లో ఉద్యోగావకాశాలు తగినంతగా లేనందున యువతరంలో పెరిగిన అసంతృప్తి కూడా ప్రధాన కారణం అన్న అంచనాలున్నాయి. ఆ నేపథ్యంలో ఈ పథకం యువతరాన్ని ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఉపాధితో అనుసంధానమైన మూడు పథకాలను ప్రకటించారు. వాటిలో మొదటిది కొత్త ఉద్యోగులకు ఒక నెల వేతనాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందజేస్తారు. ఆ మొత్తాన్ని మూడు దఫాలుగా, ఒక్కో దఫాలో రూ.15వేలు గరిష్ఠంగా, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో రిజిస్టర్ చేసుకున్న కొత్త ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తారు.
రెండో పథకం కింద ‘‘నిర్దిష్టమైన మొత్తంలో ఒక ప్రోత్సాహకాన్ని ఉద్యోగికీ, యజమానికీ నేరుగా అందజేస్తారు. అది వారి ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్‌కు అనుగుణంగా ఉంటుంది. ఉద్యోగంలో మొదటి నాలుగేళ్ళ పాటు ఈ పథకం వర్తిస్తుంది. దీనివల్ల 30లక్షల మంది యువతకు, వారికి ఉద్యోగాలిచ్చిన యజమానులకూ లబ్ధి చేకూరుతుంది’’ అని మంత్రి ప్రకటించారు.
మూడో పథకం కింద ‘‘నెలకు రూ.లక్ష లోపు వేతనంతో తీసుకునే అదనపు ఉద్యోగాలను లెక్కిస్తాం. అలాంటి అదనపు ఉద్యోగులు ఉన్న యజమానులకు రెండేళ్ళపాటు నెలకు గరిష్ఠంగా రూ.3వేల చొప్పున ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వం రీఇంబర్స్ చేస్తుంది’’ అని మంత్రి చెప్పారు. ఈ పథకం వల్ల 50లక్షల మంది అదనపు ఉద్యోగులకు ప్రయోజనం వాటిల్లుతుంది.
ఉద్యోగాల్లో మహిళలను ప్రోత్సహించడానికి దేశంలోని పలు ప్రాంతాల్లో వర్కింగ్ వుమెన్స్ హాస్టళ్ళను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.