కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ తన బడ్జెట్ ప్రసంగంలో క్యాన్సర్ మందులు, మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించారు. ఫలితంగా మార్కెట్లో వాటి ధరలు బాగానే తగ్గుతాయి. అలాగే దిగుమతి చేసుకునే బంగారం, వెండి, తోలు వస్తువులు, సీఫుడ్ కూడా చవగ్గా లభిస్తాయి.
‘‘క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మరో మూడు మందులను కస్టమ్స్ సుంకం పరిధిలోనుంచి ప్రభుత్వం తప్పిస్తోంది. ఇంకా మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇతర విడిభాగాలపై కనీస కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గిస్తున్నాను’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.
ఆర్ధికమంత్రి బంగారం, వెండి దిగుమతి సుంకాలను 6శాతానికి తగ్గించారు. దానివల్ల రీటెయిల్ వ్యాపారంలో డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు, బంగారం స్మగ్లింగ్ కూడా తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నాయి.
ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువ వాడేది మన దేశమే. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు బంగారంపై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల వాణిజ్యలోటు పెరుగుతుంది, రూపాయిపై భారమూ పెరుగుతుంది.
మరోవైపు, అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం 10శాతం పెంచింది. అలాగే నాన్-బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని 25శాతం పెంచింది. టెలికాం పరికరాల ధరలు కూడా పెరుగుతాయి.