2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయరంగంలో పరిశోధనలు, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఉందని ఆమె వెల్లడించారు.
వ్యవసాయరంగంలో ప్రత్యేకించి పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి, నిల్వసౌకర్యాలు, మార్కెటింగ్ సదుపాయాలు పెంచడంలో పరిశోధనలు, అభివృద్ధి చేయడానికి గణనీయంగా నిధులు సమకూరుస్తామని మంత్రి ప్రకటించారు. ఆవ, వేరుసెనగ, నువ్వుల, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడమే తమ లక్ష్యమని మంత్రి ప్రకటించారు.
కూరగాయల సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రధాన వినియోగ కేంద్రాలకు చేరువలో కూరగాయలను ఉత్పత్తి చేసే పెద్దస్థాయి క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి బడ్జెట్ ప్రతిపాదిస్తోందని చెప్పారు.
రైతులు, వారి భూములను సమగ్రంగా కవర్ చేయడం కోసం వ్యవసాయం కోసం డిజిటల్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు మూడేళ్ళ ప్రణాళికను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ యేడాది ఆ పద్ధతిలో దేశంలోని 400 జిల్లాల్లో ఖరీఫ్ పంటను డిజిటల్ సర్వే చేస్తామని వెల్లడించారు. తద్వారా దేశంలోని ఆరు కోట్లమంది రైతులు, వారి పొలాల వివరాలను రైతు-భూమి రిజిస్ట్రీల్లో నమోదు చేస్తామని వివరించారు. ఐదు రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తామన్నారు.
రొయ్యల సాగు, ఎగుమతులకు కావలసిన న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్ల ఏర్పాటుకు నాబార్డ్ ద్వారా ఆర్ధిక సహాయం అందజేస్తామని మంత్రి చెప్పారు. సహకార రంగాన్ని క్రమబద్ధంగా బలోపేతం చేసేందుకు కొత్త జాతీయ సహకార విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా పెద్దస్థాయిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచుతామన్నారు.