ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుమతి మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు.
రెవెన్యూ మంత్రి ప్రతిపాదన సభా సమక్షంలో ఉందన్న స్పీకర్, ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దు బిల్లు-2024ను ప్రవేశపెట్టారని సభ్యులకు వివరించారు. ప్రతిపాదన పట్ల సభలో సుముఖంగా ఉన్నవారు అవును అని… వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అని చెప్పాలని అయ్యన్నపాత్రుడు కోరారు. అందరూ అవును అని సమాధానం చెప్పారు. దీంతో బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
దీనిపై శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో తెలుగులో మాట్లాడి బిల్లును ప్రవేశపెట్టడం హర్షణీయం అని కొనియాడారు. అందరికీ ఇష్టమైన బిల్లును తెలుగులో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సార్ అని వ్యాఖ్యానించారు.