కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో బంగారం, వెండి, ప్లాటినం మీద కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
‘‘ఆభరణాలకు వినియోగించే లోహాల దేశీయ అదనపు విలువను పెంచడానికి బంగారం, వెండి మీద కస్టమ్స్ సుంకాన్ని 6శాతానికీ, ప్లాటినం మీద కస్టమ్స్ సుంకాన్ని 6.4శాతానికీ తగ్గించాలని ప్రతిపాదిస్తున్నాను’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.
‘‘ఇతర లోహాల్లో స్టీల్, రాగి ముఖ్యమైనవి. వాటి తయారీ ఖరీదును తగ్గించేందుకు ఫెర్రో నికెల్, బ్లిస్టర్ కాపర్ మీద కనీస కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా తొలగిస్తాం. ఫెర్రస్ స్క్రాప్, నికెల్ క్యాథోడ్ మీద కూడా కనీస కస్టమ్స్ సుంకాన్ని తొలగిస్తాం. కాపర్ స్క్రాప్ మీద కనీస కస్టమ్స్ సుంకాన్ని 2.5శాతంగా ఉంచుతాం’’ అని నిర్మల వివరించారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకముంచి మూడోసారి గెలిపించినందుకు ప్రజలకు నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలియజేసారు. మా విధానాలపై నమ్మకముంచి మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు. మతం, కులం, లింగం, వయసుతో సంబంధం లేకుండా భారతీయులందరి ఆకాంక్షలను, జీవితాశయాలనూ నెరవేర్చుకోడంలో సహాయపడడదానికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం’’ అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఆశించినదానికంటె మెరుగైన పనితీరు కనిపించినప్పటికీ విధానపరమైన అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. ‘‘పెంచేసిన ఆస్తుల విలువలు, రాజకీయ అనిశ్చితులు, రవాణా సమస్యల వల్ల అభివృద్ధికి ఇంకా ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణంలో ఒడుదొడుకులూ అలాగే ఉన్నాయి’’ అని మంత్రి చెప్పారు. అయినప్పటికీ భారతదేశపు ఆర్థికాభివృద్ధి రాబోయే సంవత్సరాల్లోనూ గణనీయంగా పెరుగుతూనే ఉంటుందని మంత్రి చెప్పుకొచ్చారు.
‘‘దేశపు ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయిలోనే కొనసాగుతోంది. 4శాతం లక్ష్యం దిశగా సాగుతోంది. ప్రస్తుతం ప్రధాన ద్రవ్యోల్బణం 3.1శాతం ఉంది. నిల్వ ఉండని వస్తువులు మార్కెట్‌కు తగినంతగా సరఫరా కచ్చితంగా అయేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని చెప్పారు.
వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెంచేందుకు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగల వెరైటీలను అభివృద్ధి చేసేందుకూ వీలుగా వ్యవసాయ పరిశోధనలపై సమగ్ర సమీక్ష చేపడతామని మంత్రి చెప్పారు. అటువంటి పరిశోధనలపై ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నిపుణులతో పర్యవేక్షణ చేపడతామన్నారు. రెండు రంగాల నుంచీ నిధుల సమీకరణ జరుగుతుందని వివరించారు.