పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ద్వంద్వ వైఖరి, నయవంచక విధానాలూ మరోసారి బట్టబయలయ్యాయి. ఉపఖండం నుంచి ఖండించబడిన దేశాల్లో ఊచకోతకు గురవుతున్న హిందువుల రక్షణకు సంబంధించిన సీఏఏను వ్యతిరేకించిన మమతా బెనర్జీ, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఆందోళన చేస్తున్న రాడికల్ ముస్లిములకు ఆశ్రయం ఇవ్వడానికి తాను సిద్ధమంటూ ప్రకటించింది. మమతా బెనర్జీ తాజా వైఖరి దేశంలోకి విదేశస్తుల రాక గురించి, మైనారిటీల హక్కుల గురించి ఆమె ప్రభుత్వ ఆలోచనా ధోరణి గురించి అనుమానాలు కలగజేస్తోంది.
‘‘బంగ్లాదేశ్ ఒక సార్వభౌమదేశం కాబట్టి, వారితో వ్యవహారాలు కేంద్రప్రభుత్వ పరిధిలో ఉండే అంశం కాబట్టి ఆ దేశపు వ్యవహారాల గురించి నేను మాట్లాడకూడదు. కానీ నేను ఒక విషయం చెబుతాను. నిస్సహాయులైన ప్రజలు బెంగాల్ తలుపు తడితే, వారికి కచ్చితంగా ఆశ్రయం కల్పిస్తాం’’ అని మమతా బెనర్జీ చెప్పింది.
సోమవారం అమరవీరుల దినం సందర్భంగా కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన మమతా బెనర్జీ బంగ్లాదేశ్ తాజా గొడవను అస్సాంలోని బోడో ఘర్షణలతో పోల్చింది. అస్సాం ప్రజలను బెంగాల్‌లోని అలీపూర్ ప్రాంతంలో ఉండనిచ్చినట్లుగానే బంగ్లాదేశీయులకు తమ రాష్ట్రంలో ఆశ్రయం ఇస్తామంటోంది. పైగా, బంగ్లాదేశ్ ఘర్షణల విషయంలో రెచ్చిపోవద్దని, సహనంగా ఉండాలనీ తమ రాష్ట్రంలోని ప్రజలకు పిలుపునిచ్చింది.
అసలు వివాదం ఎక్కడొస్తుందంటే, మమతా బెనర్జీ ప్రభుత్వం తమ రాష్ట్రంలో సీఏఏ అమలు చేయడానికి వ్యతిరేకించింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందూ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి అడ్డుకుంది. 2020 నుంచీ ఆమె సీఏఏ వ్యతిరేక ఘర్షణలకు నాయకత్వం వహిస్తూ వచ్చింది. సీఏఏకు వ్యతిరేకంగా తమ రాష్ట్ర శాసనసభలో తీర్మానం కూడా చేసింది. సీఏఏ గురించి అబద్ధాలు ప్రచారం చేసి ముస్లిములను భయపెట్టడం, రెచ్చగొట్టడం చేసింది. సీఏఏ అమల్లోకి వస్తే మనదేశంలోని పౌరులు శరణార్థులుగా మారిపోతారనీ, వారి ఓటుహక్కును లాగేసుకుంటారనీ ఎన్నోసార్లు అబద్ధాలు ప్రచారం చేసింది. అలాంటి మమత, బంగ్లాదేశ్‌లో అతివాద ముస్లిములు రేపుతున్న ఘర్షణల పట్ల సానుభూతి చూపుతూ వారికి బెంగాల్‌లో ఆశ్రయం ఇస్తామని చెప్పడం కచ్చితంగా దేశవ్యతిరేక చర్యే. పైగా, పొరుగు దేశపు పౌరులకు మనదేశంలో ఆశ్రయం ఇవ్వాలంటే అది రాష్ట్రప్రభుత్వం పని కాదు, కేంద్రప్రభుత్వం పరిధిలోని వ్యవహారం. అందులో వేలు పెడుతోంది.
మమతా బెనర్జీ ప్రకటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. త్వరలో జరగబోయే జార్ఖండ్ ఎన్నికల్లో అక్కడి ఫలితాలను ప్రభావితం చేసేలా అక్కడికి బంగ్లాదేశీ ముస్లిములను అనధికారికంగా వలసవచ్చేలా చేసేందుకు ఇండీ కూటమి పన్నిన కుట్రలో భాగంగానే మమతా బెనర్జీ అలాంటి ప్రకటన చేసిందంటూ బీజేపీ మండిపడింది.
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పద్ధతిపై ఆగ్రహంతో ఉన్నవారు మొదలుపెట్టిన ఘర్షణల్లో 150మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ చిచ్చు ఇంకా ఆరలేదు. దేశవ్యాప్తంగా షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులతో కర్ఫ్యూ విధించారు.