కెనడాలోని ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయం గోడలపై కొందరు దుండగులు భారత వ్యతిరేక రాతాలు రాశారు. ప్రధాని మోదీ, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కొన్ని స్లోగన్లను గోడలపై రాశారు. ఈ ఘటనను కెనడా విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది.
బాప్స్ స్వామినారాయణ మందిరంలో హిందూ ఫోబిక్ తీవ్రవాద విధ్వంసక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
శాంతి, సహృద్భావం వాతావరణాన్ని సృష్టించే హిందూ సమాజంపై కొంతమంది తీవ్రవాద భావజాలంతో రెచ్చిపోతున్నారని మండిపడింది. భారత్, సనాతన ధర్మం పట్ల అనుచితంగా వ్యవహరించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఖలిస్థానీ వేర్పాటువాదులు ఇలా ఆలయాలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం కొత్తేంకాదు. గతంలోనూ ఇదే తరహా ఘటనలకు పాల్పడ్డారు. హిదూ ఆలయాల గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్య తర్వాత నుంచి మరింత పెచ్చుమీరాయి. అతివాద భావజాలానికి వ్యతిరేకంగా కెనడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.