మాజీ మంత్రి కొడాలి నాని పీఏ ఆచంట లక్ష్మోజీపై దాడి జరిగింది. గుడివాడలో గత రాత్రి ఈ దాడి చోటు చేసుకుంది. కొడాలి నాని మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద లక్ష్మోజీ పీఏగా పనిచేశారు. అప్పట్లో లక్ష్మోజీ చేసిన అరాచకాలను మనసులో పెట్టుకుని, బాధితులు దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం పౌరసరఫరాల శాఖలో ఆర్ఐగా లక్ష్మోజీ విధులు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నంలో విధులు ముగించుకుని సోమవారం రాత్రి రైల్లో గుడివాడ చేసుకున్న లక్ష్మోజీపై దుండగులు దాడి చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
దాడిలో గాయపడ్డ లక్ష్మోజీని ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తరవాత ఓ ప్రైవేటు ఆసుపత్రికి లక్ష్మోజీని మార్చారు. దాడిపై ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని లక్ష్మోజీ కోరారు. దాడి ఘటన తెలియగానే జిల్లా ఎస్పీ గుడివాడ చేరుకుని విచారణ ప్రారంభించారు.