కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఉదయం దేశ రాజధానిలో నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్ళారు. మరికొద్దిసేపట్లో పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం కేంద్ర బడ్జెట్ 2024-25 డిజిటల్ ప్రతిని తీసుకువెళ్ళారు.
నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్ సమర్పిస్తున్నారు. గతంలో మొరార్జీదేశాయ్ ఆరుసార్లు బడ్జెట్ సమర్పించిన రికార్డును నిర్మల నేడు అధిగమిస్తున్నారు. ఈ బడ్జెట్లో ఆదాయపుపన్ను విధానాన్ని మార్చే అవకాశం ఉంది. భారతదేశంలో సులభతర వాణిజ్య విధానాలను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
నరేంద్రమోదీ మూడోసారి ఏర్పాటు చేసిన ఎన్డీయే ప్రభుత్వపు విధానం ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’కు అనుగుణంగానే కేంద్ర బడ్జెట్ ఉంటుందని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జులై 22న మొదలయ్యాయి, ఆగస్టు 12న ముగుస్తాయి.