సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. రూ.5 లక్షలు అప్పిస్తామంటూ ఓ మహిళకు ఎరవేశారు. ఆ మహిళ నుంచి డబ్బు కాజేశారు. మోసపోయిన మహిళ ప్రాణం తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
కృష్ణా జిల్లా పడిముక్కల మండలం, మంటాడకు చెందిన స్రవంతి ఫోన్కు ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. నీకు రూ.5 లక్షల రుణం మంజూరైందని మెసేజ్ పంపించారు. దానిలో నేరగాళ్ల ఫోన్ నెంబరు కూడా ఉంది. వారితో స్రవంతి సంప్రదింపులు ప్రారంభించింది. రూ.5 లక్షలు రుణం కావాలంటే ముందుగా రూ.20 వేలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని కేటుగాళ్లు కోరారు. ఆమె అప్పు చేసి వారి ఖాతాలో వేసింది. ఆ తరవాత మరో రూ.80 వేలు ఇవ్వాలని చెప్పడంతో మరలా బంధువుల వద్ద అప్పుచేసి సైబర్ నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేసింది. మరోసారి లక్ష చెల్లిస్తే రూ.5 లక్షల రుణం ఇస్తామని చెప్పడంతో మోసపోయినట్లు స్రవంతి గ్రహించింది. భర్తకు విషయం చెప్పలేక వీడియో రికార్డు చేసి ఇంట్లో ఉరేసుకుంది.
కుటుంబసభ్యులు గమనించి ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించినా ప్రాణం దక్కలేదు. భర్త శ్రీకాంత్ తాపీమేస్త్రీగా చేస్తున్నాడు. డబ్బు పోయిన విషయం భర్తకు చెప్పుకోలేక స్రవంతి ప్రాణాలు తీసుకుంది. స్రవంతికి 4,6 సంవత్సరాల పిల్లలున్నారు. తల్లి మరణంతో పిల్లలు అనాధలయ్యారు.
సైబర్ నేరాల గురించి ఎంత ప్రచారం చేసినా ఇంకా జనం మోసపోతున్నారని, అప్రమత్తంగా ఉండాలని పోలీసు సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.