స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన మొదటి గైడెడ్ మిసైల్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో మంటలు చెలరేగాయి. ఆదివారం ముంబయిలోని డాక్ యార్డులో మరమ్మతులు చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నానికి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఓ సెయిలర్ గల్లంతయ్యారు. మిగిలిన సిబ్బంది ప్రమాదం నుంచి బయటపడినట్లు ప్రకటించారు. ప్రమాద ఘటన వివరాలను నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు నివేదించారు.
పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన గైడెడ్ మిసైల్ యుద్దనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రను 2000, ఏప్రిల్‌లో జలప్రవేశం చేయించారు. అప్పటి నుంచి నేవీ అవసరాలను తీరుస్తోంది. ఇటీవల కొన్ని మరమ్మతులు చేయించేందుకు ముంబైలోని డాక్ యార్డుకు తీసుకొచ్చి పనులు ప్రారంభించారు. వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోంది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.