అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి మంటలు రాజుకున్నాయి. ఆ ఘటనలో కంప్యూటర్లు, ఫైళ్ళు తగులబడ్డాయి. అది ప్రమాదవశాత్తు జరిగినది కాదని, ఉద్దేశపూర్వకంగా తగులబెట్టిన సంఘటన అని పోలీసులు భావిస్తున్నారు.
ఆదివారం అర్ధరాత్రికి కొద్దిగా ముందు సబ్‌కలెక్టర్ ఆఫీసులోని ఒక గదిలో మంటలు రేగాయి. అంతకు కొద్దిసేపటి ముందువరకూ కొందరు ఉద్యోగులు ఆఫీసులో ఉన్నారు. కొత్త సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ సోమవారం బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. సబ్‌కలెక్టర్ ఆఫీసు వెనకాలే ఫైర్‌స్టేషన్ ఉంది. దాంతో పది నిమిషాల్లోనే ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పగలిగాయి. అప్పటికే ముఖ్యమైన కంప్యూటర్లు, ఫైళ్ళు తగులబడిపోయినట్లు గుర్తించారు.
ఈ సంఘటన గురించి తెల్లవారేసరికి ముఖ్యమంత్రికి తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు డిజిపి ద్వారకా తిరుమల రావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ హెలికాప్టర్లో మదనపల్లె చేరుకుని విచారణ ప్రారంభించారు. అప్పటికే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తిరుపతి సిఐడి బృందం తమ ప్రాథమిక విచారణ నివేదికను డిజిపికి అందజేసింది. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు కూడా విచారణ జరిపి, సంఘటన షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదని స్పష్టం చేసింది. సంఘటనాస్థలంలో అగ్గిపుల్లలు, బీరు బాటిళ్ళు దొరకడాన్ని బట్టి ఎవరో కావాలనే తగులబెట్టి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ అక్రమాలు బైటపడకూడదనే ఉద్దేశంతోనే ఆయనకు అనుకూలమైన వారే ఉద్దేశపూర్వకంగానే ఫైళ్ళు, కంప్యూటర్లు తగలబెట్టారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ ఆరోపణలను వైసీపీ త్రోసిపుచ్చింది. రాష్ట్రంలో అరాచక పాలన, రాజకీయ హత్యల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు అధికార పక్షం ఈ నాటకం ఆడుతోందని మండిపడింది. సబ్‌కలెక్టర్ కార్యాలయంలోని రికార్డులు, వాటి వివరాలు ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాలతో పాటు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయని గుర్తుచేసింది. చంద్రబాబు ఆటవిక పాలనపై వైయస్సార్ కాంగ్రెస్ ఢిల్లీలో చేపట్టబోయే నిరసన, ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్ల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు