ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్గా శాంతి ఉద్యోగం ఎలా పొందారన్న విషయంపైనే చాలా ఆరోపణలు ఉన్నాయనీ, ఆ వ్యవహారంపైనే విచారణ జరుగుతోందనీ దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శాంతి నియామకం అక్రమం అని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యాక, తగిన ఆధారాలు సేకరించాక ఏపీపీఎస్సీని కూడా వివరణ కోరతామన్నారు.
ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న శాంతి, విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆమె నిర్ణయాలపై పలు ఆరోపణలున్నాయని మంత్రి వెల్లడించారు. వాటన్నిటిపైనా విచారణ జరుగుతోందన్న ఆనం, ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు, శాంతి మీద దేవదాయ శాఖ మరో ఆరు అభియోగాలు నమోదు చేసింది. జులై 2న సస్పెండ్ చేసినప్పుడు చేసిన తొమ్మిది అభియోగాలకు అదనంగా ఈ కొత్త అభియోగాలు నమోదయ్యాయి.
ఉద్యోగంలో చేరినప్పుడు భర్తపేరు మదన్మోహన్ అని చెప్పి, వేరొకరిని వివాహం చేసుకున్నట్లు ఇటీవల వెల్లడించడంపై ఒక అభియోగం నమోదయింది. కమిషనర్ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడడంపై ఇంకో అభియోగం నమోదైంది. ప్రభుత్వ ఉద్యోగి అయిఉండీ ఒక రాజకీయ పార్టీకి బహిరంగంగా మద్దతు పలికినట్లు వ్యవహరించడంపై మరో అభియోగం నమోదయింది. విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన అధికార పరిధిని అతిక్రమించి చేసిన వ్యవహారాలపైన కూడా అభియోగాలు నమోదయ్యాయి.
శాంతి వ్యవహారశైలితో మంత్రిత్వశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిందనీ, దానిపై వివరణ ఇవ్వాలనీ ఎండోమెంట్స్ కమిషనర్ సత్యనారాయణ ఆమెకు తాఖీదు జారీ చేసారు. పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు