బిహార్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రప్రభుత్వం తెలియజేసింది. ఎన్డీయే కూటమి భాగస్వామ్య పార్టీ అయిన జనతాదళ్ యునైటెడ్, బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ డిమాండ్ చేసింది. దానిగురించి పార్లమెంటులో ఇవాళ కేంద్రం జవాబిచ్చింది.
ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బిహార్ సహా వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన ఉందా అని జేడీయూ ఎంపీ రామ్‌ప్రీత్ మండల్ ప్రశ్నించారు. దానికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధురి రాతపూర్వకంగా జవాబిచ్చారు. బిహార్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ వేదికగా వెల్లడించారు.
ఎన్డీయేలో జేడీయూ మూడో అతిపెద్ద పార్టీ. 12మంది ఎంపీల బలం ఉంది. కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచీ జేడీయూ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న వాదనను పలుసందర్భాల్లో వినిపించింది. ఇటీవల ఆ పార్టీ తమకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా ఆమోదిస్తామంటోంది.
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. 2014లో రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కొన్నాళ్ళకు ప్రత్యేక హోదా కుదరదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. దానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించింది. అయితే 2019 ఎన్నికల ముందు వైసీపీ ప్రత్యేక హోదా అంశాన్ని బలంగా లేవనెత్తింది. దాంతో నష్టపోతామని భావించిన టీడీపీ, ఎన్డీయే నుంచి బైటకు వచ్చి ప్రత్యేక హోదా పేరిట బీజేపీ, నరేంద్రమోదీకి వ్యతిరేకంగా పోరాడింది.
ఇప్పుడు 2024 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముందు టీడీపీ మళ్ళీ ఎన్డీయేలో చేరింది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి అధికారంలోకి వచ్చింది. లోక్‌సభలో ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం రెండోస్థానంలో నిలిచింది. మూడోస్థానంలో నిలబడిన జేడీయూ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన ప్రతీసారీ తెలుగుదేశం వైఖరి గురించి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.
ఇవాళ పార్లమెంటులో బిహార్‌కు ప్రత్యేక హోదా ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రమంత్రి స్పష్టం చేయడంతో ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. దీనిపై విపక్షాలు రచ్చ చేసే అవకాశముంది.