ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లలో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడంపై తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఎక్కువ పనిగంటలు, క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాల్సి ఉండే ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడంపై ఆమె ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ తీవ్ర విమర్శలకు దారితీసింది.
దివ్యాంగుల సామర్థాన్ని తాను తప్పు పట్టడం లేదని, కానీ వారిని ఇలాంటి కష్టతరమైన ఉద్యోగాల్లోకి తీసుకునే విషయంలో ఆలోచన చేయాలని సూచించారు. ఒక విమానం నడిపే ఫైలెట్ కానీ, ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ కానీ దివ్యాంగులు ఉండటం మనం చూశామా అంటూ కొందరు నెటిజన్లు చేసిన కామెంట్లకు రీట్వీట్ చేశారు.
స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై దివ్యాంగులతోపాటు, నెటిజన్లు మండిపడుతున్నారు. శక్తి సామర్థ్యాలు అనేది అందంలో ఉండదని, మానసిక సామర్థ్యంలో ఉంటుందంటూ కామెంట్లు చేశారు. స్మితా సబర్వాల్ దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రొఫెసర్ బాలలత హెచ్చరించారు.