రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై ఆరు దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ స్వాగతించింది. దీర్ఘకాలంగా అంకితభావంతో జాతికి సేవ చేస్తున్న సంస్థ తమదని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ చెప్పుకొచ్చారు.
‘‘దేశ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నిరంతరాయంగా పనిచేస్తోంది. గత 99 సంవత్సరాలుగా సమాజానికి సేవ చేస్తోంది. జాతీయ భద్రతకు, సమైక్యతకు అవసరమైనప్పుడు, ప్రకృతి విపత్తుల సమయాల్లో ఆర్ఎస్ఎస్ చేసిన సేవలను దేశంలోని పలురకాల నాయకత్వాలు ఎప్పటికప్పుడు కొనియాడాయి’’ అని అంబేకర్ గుర్తు చేసారు.
సంఘ కార్యక్రమాల్లో ప్రభుత్వోద్యోగులు పాల్గొనకూడదంటూ ఆరు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నిషేధం విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘‘రాజకీయ స్వార్థ కారణాల చేత అప్పటి ప్రభుత్వం అన్యాయంగా ఆ నిర్ణయం తీసుకుంది. ఆర్ఎస్ఎస్ వంటి నిర్మాణాత్మక సంస్థ కార్యక్రమాల్లో ప్రభుత్వోద్యోగులు భాగస్వాములు కానీయకుండా నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని తొలగించాలని ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితమైనది, భారతదేశపు ప్రజాస్వామిక విధానాన్ని బలోపేతం చేస్తుంది’’ అని అంబేకర్ వ్యాఖ్యానించారు.