కావడి యాత్రా మార్గంలో వ్యాపారులు తమ పేర్లు ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బోర్డులపై ఉండాల్సింది, వ్యాపారుల పేర్లు కాదని, వారు తయారు చేసిన ఆహారం వివరాలు ఉంటే చాలంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కావడి యాత్రా మార్గంలో వ్యాపారులు తప్పనిసరిగా వారి పేర్లుతో కూడిన బోర్డులు పెట్టాలంటూ ముజఫరాబాద్ పోలీసులు ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు నిలిపివేసింది. తదుపరి విచారణ శుక్రవారం చేయనుంది.
గుర్తింపును బట్టి దూరం పెట్టే ఉద్దేశంతోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని పిటిషనర్ల తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. వడ్డించే వారు ఎవరనేది కాదని, వడ్డించే ఆహారం వివరాలు మాత్రమే బోర్డులో ఉండేలా చూడాలని వాదనలు వినిపించారు. ముజఫరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేదని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ప్రతి ఏటా శ్రావణమాసంలో లక్షలాది శివభక్తులు కావడి యాత్ర చేపడతారు. కావడితో గంగాజలాలను మోస్తూ తమ గ్రామాలకు తీసుకెళ్లడం శతాబ్దాలుగా వస్తోంది. కావడి యాత్ర జరిగే మార్గంలో వ్యాపారులు వారి పేర్లు ప్రదర్శించాలంటూ పోలీసు అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే.