ప్రభుత్వోద్యోగులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదంటూ ఆరు దశాబ్దాల క్రితం విధించిన నిషేధాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తొలగించింది.
ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వోద్యోగులు పాల్గొనకూడదంటూ 1966 నవంబర్ 30న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించింది. 1970 జులై, 1980 అక్టోబర్‌లోనూ అటువంటి ఆదేశాలు జారీ చేసింది. వాటన్నింటినీ తొలగిస్తూ కేంద్రప్రభుత్వం అధికారికంగా 2024 జులై 9న ఉత్తర్వులు జారీ చేసింది.
‘‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమాల్లో ప్రభుత్వోద్యోగులు పాల్గొనకూడదంటూ 58ఏళ్ళ క్రితం జారీ చేసిన రాజ్యాంగ విరుద్ధ ఉత్తర్వులను మోదీ ప్రభుత్వం ఉపసంహరించింది’’ అంటూ బీజేపీ నేత, ఆ పార్టీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయ ‘ఎక్స్’లో ట్వీట్ చేసారు.
దానికి స్పందిస్తూ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ 1966 నాటి ఉత్తర్వు కాపీని ఎక్స్‌లో పోస్ట్ చేసారు. ఆ ఆదేశాలు వాజపేయి హయాంలో కూడా అమల్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘1948 ఫిబ్రవరిలో గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్‌ను సర్దార్ పటేల్ నిషేధించారు. సత్ప్రవర్తన కలిగి ఉంటామని హామీ ఇచ్చిన తర్వాత ఆ నిషేధాన్ని ఉపసంహరించారు. 1966లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వోద్యోగులు పాల్గొనకూడదంటూ నిషేధం విధించారు. అది చాలా సరైనది’’ అని జైరాం రమేష్ ట్వీట్ చేసారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే… ఆ నిషేధాన్ని తొలగించినందుకు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే 1963లో గణతంత్రదిన పెరేడ్‌లో పాల్గొనాలంటూ స్వయంసేవకులను ఆహ్వానించింది. 1962 చైనాతో యుద్ధం సమయంలో సరిహద్దుల వద్ద సంఘ్ కార్యకర్తల సేవలతో ముగ్ధుడైన అప్పటి ప్రధానమంత్రి జవాహర్‌లాల్ నెహ్రూ, మరుసటి సంవత్సరపు రిపబ్లిక్ డే పెరేడ్‌లో పాల్గొనడానికి ఆర్ఎస్ఎస్‌ను ఆహ్వానించారు.
అలాగే, 1970లో కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్‌ను నిర్మించిన అప్పటి సంఘ్ సర్‌కార్యవాహ ఏకనాథ్ రానడే, ఆ స్మారకం ఆవిష్కరణకు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆహ్వానించారు. ఆమె ఆ కార్యక్రమానికి హాజరై, వివేకానంద శిలాస్మారకాన్ని ఆవిష్కరించారు.
అలా, ఈ దేశంలో జాతీయవాదాన్ని ప్రోత్సహించడంలో సంఘ్ కృషిని కాంగ్రెస్ ప్రధానమంత్రులే అభినందించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ మాత్రం ఆ సంస్థపై అనవసరపు, రాజ్యాంగ విరుద్ధమైన నిషేధాన్ని తొలగించడాన్ని తప్పు పడుతోంది.
మోదీ ప్రభుత్వ నిర్ణయం వెనుక….
ఇంతకీ ఇప్పుడు మోదీ సర్కారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? భారతీయ మజ్దూర్ సంఘ్‌కు అనుబంధ సంస్థ ‘గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేషనల్ కాన్ఫెడరేషన్’ ప్రధాన కార్యదర్శి సాధు సింగ్ 2018లో కేంద్రప్రభుత్వానికి ఒక లేఖ రాసారు. సంఘ్ కార్యక్రమాల్లో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని ఆయన డిమాండ్ చేసారు.
‘‘ఆర్ఎస్ఎస్ ఒక సామాజిక స్వచ్ఛందసేవా సంస్థ, దేశ నిర్మాణం కోసం వారి సమాజసేవలో పాలుపంచుకోవాలని భావించే ప్రభుత్వోద్యోగులు ఎందరో ఉంటారు. అయితే అప్పటి నిషేధం వల్ల, క్రమశిక్షనా చర్యలు తీసుకుంటారనే భయం వల్ల, వారు జాతి నిర్మాణంలో తమవంతు పాత్ర నిర్వహించలేకపోతున్నారు. కాబట్టి ఆ నిషేధాన్ని తొలగించాలి’’ అంటూ సాధు సింగ్ తన లేఖలో పేర్కొన్నారు.
2000 సంవత్సరంలో కేశూభాయ్ పటేల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గుజరాత్‌లో, సంఘ్ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని తొలగించారు. ఇప్పుడు మోదీ సర్కారు చర్యతో దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.