పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు చాలా దేశాలు ప్రణాళికలు అమలు చేస్తూ ఉంటాయి. అయితే స్పెయిన్‌లో వింత సమస్య ఎదురైంది. టూరిస్టులు పెరిగిపోవడంతో స్థానికులకు సరైన సదుపాయాలు అందడం లేదని పలు సంస్థలు ఎప్పటి నుంచో నిరసన తెలుపుతున్నాయి. తాజాగా స్పెయిన్‌లోని ఇబిజా, మల్లోర్కా, మెనోర్కా ప్రాంతానికి చెందిన 20 వేల మంది స్థానికులు, పర్యాటకులను తగ్గించాలంటూ భారీ నిరసన తెలిపారు.
స్పెయిన్‌కు పర్యాటకుల ద్వారా భారీ ఆదాయం లభిస్తోంది. ఇదో పరిశ్రమగా విస్తరించింది. ఇబిజా, మల్లోర్కా, మెనోర్కా ద్వీపాలకు గడచిన ఏడాదిలో కోటి 80 లక్షల మంది పర్యాటకులు వచ్చారు. వీరి ద్వారా ఆయా ప్రాంతాలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. అయితే 12 లక్షలు నివాసం ఉంటే ఈ మూడు ద్వీపాలకు టూరిస్టులు పోటెత్తడంతో ఒత్తిడి పెరిగిపోయింది. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గత మేలో కూడా పర్యాటకులను తగ్గించాలని స్థానికులు నిరసన తెలిపారు.
పర్యాటకులను అదుపు చేయాలని, వారిపై టూరిస్ట్ టాక్స్ వేయాలంటూ 20 వేల మంది స్థానికులు నిరసన ర్యాలీ చేశారు. టూరిస్ట్ టాక్స్ వేయడం ద్వారా పర్యాటకులు తగ్గే అవకాశం పెద్దగా లేకపోయినా, దాని ద్వారా వచ్చే ఆదాయంతో స్థానికులకు సదుపాయాలు మెరుగుపరచవచ్చని పలు సంస్థలు సూచిస్తున్నాయి.