తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస్య దీక్ష సంకల్పం జరిగింది. తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ, శ్రీ వైష్ణవ సంప్రదాయకర్త శ్రీ రామానుజాచార్యుల పారంపర్యంలో చాతుర్మాస్య దీక్ష విశేషస్థానం ఉందన్నారు.
తొలుత శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో కలశ స్థాపన, కలశ పూజ, విష్వక్సేన ఆరాధన, మేదిని పూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పుట్టమన్నుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాతుర్మాస సంకల్పం స్వీకరించారు.
మంగళవాయిద్యాల మధ్య శ్రీవారి ఆలయానికి చేరుకున్న జీయంగార్లకు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. శ్రీ జీయంగార్లు స్వామిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్చాట్ వస్త్రాన్ని, శ్రీ చిన్నజీయంగారికి ఉల్ చాట్ వస్త్రాన్ని సమర్పించారు.
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 16 నుంచి18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.