పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ భేటీ జరిగింది. బడ్జెట్ ప్రవేశ పెట్టనుండటంతో ప్రభుత్వ కార్యాచరణను ప్రభుత్వం విపక్షాలకు వివరించింది. సభ ముందుకు రానున్న బిల్లుల జాబితా గురించి కూడా సభ్యులకు రాజ్ నాథ్ వివరించారు. తెలుగుదేశం తరఫున ఆ పార్టీ నేత, పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. వైసీపీ నుంచి ఆ పార్టీ రాజ్యసభపక్ష నేత విజయసాయిరెడ్డి హాజరయ్యారు.
కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేశ్, కె.సురేశ్ పాల్గొనగా మజ్లిస్ పార్టీ తరఫున అసదుద్దీన్ ఓవైసీ సహా జేడీయూ, ఆప్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ ప్రతినిధులు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి.
బడ్జెట్ ను మంగళవారం ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందు ఉంచనున్నారు. నీట్ పేపర్ లీకేజీ, రైల్వే భద్రత అంశాలపై కేంద్ర సర్కారును విపక్షం భావిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని సర్కారు వాటాను 51 శాతం కన్నా దిగువకు తగ్గించే యత్నాలను అడ్డుకుంటామని జైరాం రమేశ్ వెల్లడించారు.