‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే తొలగించేవాడు. గురువు అంటే చీకటిని తొలగించేవాడు. అజ్ఞానము అనే అంధకారాన్ని తొలగించేవాడు గురువు. సనాతన ధర్మంలో అటువంటి జ్ఞానబోధ చేసినవాడు వేదవ్యాసుడు. ఆయన ఆషాఢ పూర్ణిమ నాడు జన్మించాడు. కాబట్టి ఆయన జన్మతిథిని ‘గురుపూర్ణిమ’గా జరుపుకోవడం భారతీయుల సంప్రదాయం.
వ్యాసుడు పరాశర మహర్షికి, సత్యవతికి జన్మించాడు. ఒక నల్లని ద్వీపంలో పుట్టాడు కనుక ఆయనను “కృష్ణ ద్వైపాయనుడు” అని కూడా పిలుస్తారు. అయితే, తన తండ్రియైన పరాశర మహర్షి సంకల్పించి ప్రోగు చేసిన వేద రాశులను నిత్య కర్మలలో, క్రతువులలో వాటివాటి ఉపయోగాన్ని బట్టి ఋగ్-యజుర్-సామ-అధర్వణ అను నాలుగు వేదములుగా విభజించినందున “వేద వ్యాసుడు” అని పేరు గడించాడు.
అఖండ వేదరాశిని వింగడించిన తరువాత గణేశుడు లేఖకుడిగా ‘మహాభారతం’ అని వ్యవహార నామం కలిగిన‘జయం’ అనే ఇతిహాసాన్ని రచింపజేసాడు. అంతే కాక, అష్టాదశ పురాణాలు సహా మరెంతో సాహిత్యాన్ని ప్రసాదించాడా మహానుభావుడు. అటువంటి వేదవ్యాసుణ్ణి భారతీయ సనాతన ధర్మావలంబులు గురువుగా భావిస్తారు.
“వ్యాసం వశిష్ట నప్తారం శక్తేః పౌత్రం అకల్మషం, పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం”
అంటే… వశిష్టుని మునిమనుమడైన, కల్మషరహితుడైన శక్తికి మనుమడైన, పరాశరుని కుమారుడైన, శుకమహర్షి తండ్రియైన ఓ వ్యాస మహర్షీ! నీకు వందనము…. అని అర్ధం.
సనాతన ధర్మాన్ని ఆచరించేవారు త్రిమూర్తులను, వారి తర్వాత భారతీయ ఋషి పరంపరలో అగ్రేసరులైన వశిష్ఠ, శక్తి, పరాశర, వ్యాస, శుకులను… గౌడపాద, గోవింద భగవత్పాద, శంకరాచార్యులనూ పూజించడం భారతీయ సంప్రదాయం.
గురుపూర్ణిమ లేక ఆషాఢ పూర్ణిమ నుంచే చాతుర్మాస్యవ్రతం మొదలవుతుంది. సన్యాసాశ్రమంలో ఉండే యతీంద్రులు, పీఠాధిపతుల వంటివారు సాధారణంగా ఒకచోట ఒక రాత్రికి మించి బస చేయరు. అటువంటి వారందరూ ఈ వర్షాకాల సమయంలో నాలుగు నెలల పాటు ఒకేచోట స్థిరంగా ఉండి తమ ధ్యాన జప తపాదులు కొనసాగిస్తారు. దాన్నే చాతుర్మాస్యం అంటారు.
ఆది నుంచి ఇప్పటి వరకు ఎందరో గురువులు మనకు జ్ఞానభిక్ష పెడుతూనే ఉన్నారు. ఆ గురుపరంపరకు వందనం చేసుకోవడం మన ప్రాథమిక కర్తవ్యం.