కావడ యాత్రా మార్గంలో వ్యాపారులు తమ పేరుతో కూడిన బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని ఉత్తరప్రదేశ్ తీసుకున్న నిర్ణయంపై వివాదం కొనసాగుతుండగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉజ్జయినిలో వ్యాపారులు పేరును ప్రదర్శించాలని, క్యూఆర్‌కోడ్, ఫోన్ నెంబరు కూడా జత చేయాలని ఎంపీ ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించనున్నారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉజ్జయని మేయర్ ముఖేష్ తత్వాల్ చెప్పారు.
ఉజ్జయని అమ్మవారిని హిందువులు దర్శించుకుంటారు. భక్తులు ప్రయాణించే మార్గంలో వారు కొనుగోలు చేసే దుకాణదారుడి పేరు తెలుసుకునే హక్కు వారికుందని ముఖేష్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఈ విధానం అమలు చేస్తున్నాయి.పేరుతో కూడిన బోర్డు కొలతలు, రంగులు కూడా ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.
యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది భారత సంస్కృతిపై దాడి అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కావడ్ యాత్ర ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది.