తిరుమలలో సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుమల పవిత్రతను మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, తిరుమలలో ప్రక్షాళన చేపట్టామన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రతీరోజు రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్నామన్నారు.
ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలలో అందజేయాల్సిన ఆహార పదార్థాలను నిర్ణయించామన్నారు.
ఆహార పదార్థాల తయారీ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి, వారి సూచన మేరకు అన్నప్రసాద భవనంలో సిబ్బందిని పెంచడంతో పాటు ఇతర చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ముడి సరుకుల నాణ్యతను పెంచేందుకు అత్యాధునిక నూతన ల్యాబ్ ను తిరుమలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు.
భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి క్యూలైన్ల వద్ద ఆరు వేల మంది వేచి ఉండేలా నూతన షెడ్డు నిర్మించినట్లు వివరించారు.
క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల ఆహార అవసరాల పర్యవేక్షణకు ముగ్గురు ఏఈఓలకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ప్రసాదం నాణ్యత పెంపునకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్ లో లోపాలను సరిదిద్దుతున్నామని తెలిపారు. గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తున్న ఎస్ఎస్ డి టోకెన్లను, భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం 1.47 లక్షలు ఇస్తున్నామన్నారు. సమావేశంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సిపిఆర్ఓ డా. రవి పాల్గొన్నారు.