జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేటకు కేంద్రం 500 మంది పారా కమాండోలను రంగంలోకి దింపింది. మెరికిల్లాంటి 500 మంది పారా మిలటరీ బలగాలు ఉగ్రవాదుల ఏరివేతలో పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత కొంత కాలంగా జమ్ము కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు పెరిగాయి. నెల రోజుల్లోనే 22 మంది సైనికులను ఉగ్రవాదులు బలితీసుకున్నారు. గడచిన రెండు నెలల్లో 40 మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఇంకా 60 మంది ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాక్ సైన్యం ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి సరిహద్దులు దాటిస్తోందని జమ్ము కశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్ అభిప్రాయపడ్డారు.
పాక్ సరిహద్దుల వెంట 4వేల మంది పారా మిలటరీ బలగాలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో నిఘాను పెంచి ఉగ్రవాదులను ఏరివేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు 500 మంది పారా కమాండోలను రంగంలోకి దింపింది. త్వరలో జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయాలని ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.