మహిళల ఆసియాకప్ టి-20 టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. దాయాది పాకిస్తాన్ జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. శ్రీలంకలోని దంబుల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు ప్రత్యర్ధిని 108 పరుగులకే ఆలౌట్ చేసింది. లక్ష్యఛేదనలో, ఇంకా 35 బంతులు మిగిలిఉండగానే విజయం సాధించింది.
భారత ఓపెనర్లు షఫాలీ వర్మ (40) (6 ఫోర్లు, 1 సిక్సర్), స్మృతీ మంధాన (45) (9 ఫోర్లు) అత్యుత్తమ ప్రదర్శనతో పాక్ బౌలర్ల భరతం పట్టారు. ఫోర్లు, సిక్సర్లతో కదం తొక్కారు. ఆరో ఓవర్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్ సాధించారు. ఏడో ఓవర్లో స్మృతి ఏకంగా ఐదు బౌండరీలు బాదింది. పదో ఓవర్లో స్మృతి, 12వ ఓవర్లో షఫాలీ ఔట్ అవడంతో పాక్ కొద్దిగా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత డయలాన్ హేమలత 14 పరుగులు చేసి ఔట్ అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (5నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్ (6నాటౌట్) ఇన్నింగ్స్ పూర్తి చేసి, భారత్‌కు విజయాన్ని కట్టబెట్టారు.
అంతకుముందు బౌలింగ్ చేసిన పాకిస్తాన్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మ్యాచ్ రెండో ఓవర్లోనే పూజా వస్త్రాకర్, గుల్ ఫిరోజాను ఔట్ చేసింది. నాలుగో ఓవర్లో ఓపెర్ మునీబా అలీని కూడా పూజా ఔట్ చేసింది. తర్వాత భారత బౌలర్లు ఏ దశలోనూ పాకిస్తానీ బ్యాటర్లను నిలదొక్కుకోనివ్వలేదు. శ్రేయాంక పాటిల్ బౌలింగ్‌లో రియాజ్ ఔట్ అయింది. దీప్తి బౌలింగ్‌లో పాక్ కెప్టెన్ నిడా దర్ హేమలతకు క్యాచ్ ఇచ్చింది. భారత పేసర్ రేణుకా సింగ్ తన ఆఖరి ఓవర్లో చివరి రెండు బాల్స్‌కు రెండు వికెట్లు తీసింది. సిద్రా అమీన్, ఇరామ్ జావేద్‌లను వరుసగా పెవిలియన్‌కు పంపించింది. ఆరు వికెట్లు పతనమయ్యాక తూబా హసన్ (22), ఫాతిమా సనా (22నాటౌట్) పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసారు. అయితే 18వ ఓవర్లో దీప్తి బౌలింగ్‌లో తూబా హసన్, రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ వెంటనే సయీదా అరూబ్ షా, నష్రా సంధూ కూడా ఔట్ అయ్యారు. అయితే సయీదా రనౌట్ అవడంతో దీప్తికి హ్యాట్రిక్ దక్కలేదు.