బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిషాలోని పూరి దిశగా ప్రయాణిస్తోంది. ఇవాళ సాయంత్రానికి పూరి సమీపంలో వాయుగుండం తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరో రెండు రోజులు ఏపీలో తెలంగాణలో కుండపోత వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గడచిన 24 గంటల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. గరిష్ఠంగా 23 సెం.మీ వర్షపాతం నమోదైంది. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రతి జిల్లా కేంద్రంలో అత్యవసర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి అనిత ప్రకటించారు.