విధ్వంసం,అరాచకాలతో మారణహోమాలకు పాల్పడి అమెరికా సైన్యం చేతిలో హతమైన ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడుగా వ్యవహరించిన అల్ ఖైదా ఉగ్రవాది అమిన్ ఉల్ హక్ అరెస్టయ్యాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో అదుపులోకి తీసుకున్నారు.
అమిన్ ఉల్ హక్ 1996 నుంచి ఒసామా బిన్ లాడెన్‌కు సన్నిహితుడు. పంజాబ్ ప్రావిన్స్ లో హింసకు పలుమార్లు కుట్రలు చేశాడని పంజాబ్ పోలీసులు తెలిపారు. గూఢచార సంస్థల సహకారంతో తమ విభాగం తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.ఉగ్రవాద నిరోధక విభాగం పట్టుదల కారణంగానే హక్ ఆచూకీని కనిపెట్టగల్గామన్నారు.
హక్ పై కేసు నమోదు చేసిన సీటీడీ అధికారులు, విచారణ కోసం రహస్య ప్రాంతానికి తరలించారు.హక్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిందని గుర్తు చేశారు. హక్ అరెస్టు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో మంచి పురోగతి అని అభివర్ణించారు.