పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో గోదావరి నదికి వరద తాకిడి పెరిగింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు వరదను దవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి దిగువకు వదులుతున్నారు. గురువారం సాయంత్రం వరకు దాదాపు 2.31 లక్షల క్యూసెక్కులు దిగువకు వదలగా శుక్రవారం ఉదయానికి సమారు మూడున్నర లక్షల క్యూసెక్కులకు చేరింది. సుమారు 7,200 క్యూసెక్కుల నీటిని వ్యవసాయ అవసరాల కోసం మధ్య, తూర్పు, పశ్చిమ డెల్టాకు వదిలారు. భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గురువారం సాయంత్రానికి 18.3 అడుగులకు వరద ఉద్ధృతి చేరింది.
పోలవరం ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన 175 గేట్లను 0.7 మీటర్ల మేర ఎత్తినీటిని దిగువకు పంపుతున్నారు. వానలు ఇలానే కొనసాగితే జులై 23 నాటికి దవళేశ్వరం నుంచి ఏడు లక్షల క్యూసెక్కుల వరద కిందకు వదలాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.