(1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం మొదలుపెట్టిన మంగళ్ పాండే జయంతి నేడు)
బానిసత్వపు సంకెళ్ళ నుంచి దేశమాతకు స్వతంత్రం తీసుకొచ్చేందుకు ఎందరో వీరులు తమ ప్రాణాలు బలిదానం చేసారు. బ్రిటిష్ వారి అరాచక పరిపాలన నుంచి 1947లో దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ దానికోసం యుద్ధం సుమారు వందేళ్ళ క్రితం మొదలైంది. 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగింది. దాన్ని మొదలుపెట్టిన వీరుడు మంగళ్ పాండే. ఆయన చేపట్టిన యుద్ధం తర్వాతే దేశవ్యాప్తంగా తెల్లవారి పాలన నుంచి విముక్తులం కావాలన్న ఆకాంక్ష ప్రబలమైంది. ఆసేతు శీతాచలం బ్రిటిష్ వారి అఘాయిత్యాలపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మాతృభూమిని బానిసత్వపు సంకెళ్ళ నుంచి విడిపించే పోరాటం శతాబ్దం పాటు సాగింది. మంగళ్‌పాండే జీవించింది నిండా మూడు పదుల యేళ్ళు లేదు. కానీ ఆయన రగిల్చిన స్వాతంత్ర్య పిపాస దేశమంతటినీ కదిలించివేసింది.
మంగళ్‌పాండే ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా నగ్వా గ్రామంలో 1827 జులై 19న ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి అభయరాణి పాండే, తండ్రి దివాకర్ పాండే. 22ఏళ్ళ వయసులో మంగళ్ పాండే ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరాడు. బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీకి చెందిన 34వ బెటాలియన్‌లో సైనికుడయ్యాడు. తన బెటాలియన్‌కే వ్యతిరేకంగా తిరగబడడంతో మంగళ్‌పాండేకు ఉరిశిక్ష పడింది. ఆ తిరుగుబాటునే 1857 సైనిక తిరుగుబాటుగా వ్యవహరిస్తారు. తెల్లదొరలు దాన్ని పితూరీగా తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసినా, నిజానికి అది ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం.
మంగళ్‌పాండే తిరుగుబాటుకు ప్రధాన కారణం ఎన్ఫీల్డ్ పి-53 రైఫిల్ వినియోగం. ఆ రైఫిల్‌తో కాలిస్తే గుండు నేరుగా లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది. దానిలో గుళ్ళు నింపాలంటే బులెట్‌పై తొడుగును పళ్ళతో కొరికి తీయాల్సి వచ్చేది. ఆ తొడుగును ఆవు లేదా పంది మాంసంతో తయారుచేసేవారు. దాన్ని కొరకడం మతధర్మాలకు వ్యతిరేకంగా ఉండేది. హిందువులకు ఆవు పవిత్రమైనది, ముస్లిములకు పంది అంటే అసహ్యం. అందుకే ఆ బులెట్లను కొరకడానికి మంగళ్ పాండే వ్యతిరేకించాడు. ప్రజల్లో స్వాతంత్ర్యం అనే అగ్గిరవ్వ రాజుకునేలా చేయడానికి అది సరైన అవకాశమని మంగళ్ భావించాడు. ఆ విషయాన్ని తన బెటాలియన్ సహచరులకు చెప్పాడు. వారందరూ మంగళ్‌పాండేతో కలిసి బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసారు. అలా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయుల్లో సమైక్యత సాధించిన మొదటి వ్యక్తి మంగళ్‌పాండే.
1857 మార్చి 29న మంగళ్ పాండే తన సీనియర్ సార్జెంట్ మీద తుపాకితో కాల్పులు జరిపాడు. దాని తర్వాత అతన్ని అరెస్ట్ చేసారు. 1857 ఏప్రిల్ 8న బరాక్‌పుర్‌లోని జైల్లో ఆయనను ఉరి తీసారు. ఆ సంఘటన తర్వాత దేశంలోని పలుచోట్ల సైనికులు తెల్లదొరతనంపై విరుచుకుపడ్డారు. అలా భారతదేశపు మొదటి స్వాతంత్ర్య పోరాటం మొదలైంది. 29ఏళ్ళ చిన్నవయసులోనే మంగళ్ పాండే తెల్లదొరతనాన్ని గడగడలాడించాడు, స్వరాజ్యం కోసం దేశ ప్రజల్లో ఆకాంక్ష రగిలించాడు. అందుకే ఆయన భారతీయులందరికీ ప్రాతఃస్మరణీయుడు.