పిల్లల అల్లరి మాన్పించేందుకు తండ్రి చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలనే తీసింది. ఈ ఘటన విశాఖలోని గోపాలపట్నంలో చోటుచేసుకుంది. పిల్లలు అల్లరి చేస్తే ఉరి వేసుకుంటానని ఓ తండ్రి బెదిరించాడు. ఆ ఉరి తాడు పొరపాటున బిగుసుకుని తండ్రి మరణించాడు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… బిహార్‌కు చెందిన చందన్‌కుమార్ రైల్వే శాఖలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ గాని పనిచేస్తున్నాడు. ఐదేళ్ళ నుంచి కొత్తపాలెంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు . ఏడేళ్ళ కుమార్తె, ఐదేళ్ళ కుమారుడు చందన్ చొక్కా జేబులోని కరెన్సీ నోట్లను తీసి చించేశారు. పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చందన్‌కుమార్‌ను భార్య సముదాయించింది.తర్వాత భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం జరిగింది.
తనకు ప్రశాంతత లేకుండా చేస్తే, ఆత్మహత్య చేసుకుంటానని చందన్‌కుమార్ బెదిరించాడు. ఇంట్లోని ఫ్యాన్‌హుక్‌కు చీర కట్టి,ఉరి వేసుకునే ప్రయత్నం చేశాడు. పొరపాటున చీర మెడకు బిగుసుకుపోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన భర్తను కాపాడేందుకు భార్య ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.