ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతోన్న భారీ వర్షాలతో విశాఖ నగరం తడసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉదయం కార్యాలయాలకు వెళ్లేవారు నానా అవస్థలు పడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. గోదావరి వరద గంట గంటకు పెరుగుతోంది. 4 లక్షల క్యూసెక్కుల వరద జలాలను ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలారు.
రాష్ట్రంలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్ష జరిపారు. ప్రాణ,ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగుల ప్రవాహాలపై నిరంతరం నిఘా పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. అక్రమ తవ్వకాలతో గోదావరి గట్లు బలహీనపడ్డాయని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడన ప్రభావంతో ఏపీలో చాలా ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో 6 సెం.మీ సగటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.