విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గమ్మఆలయంలో శాకంబరీ ఉత్సవాలు రంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఆకుకూరలు, కూరగాయలతో ఆలయాన్ని అలంకరించారు. దుర్గమ్మ ఆలయంతో పాటు ఉపాలయంలోని దేవతామూర్తులు, ఉత్సవ మూర్తులకు కూడా అలంకరణ చేశారు.
మూడురోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 21 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల ఫలాలతో అమ్మవారిని అలంకరించారు.
దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఏర్పాట్లను ఈవో రామారావు పర్యవేక్షించారు. దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. దీంతో భక్తుల క్షేమం కోసం ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన అధికారులు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో హోమాలు, ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. కూరగాయలతో వండిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. భూలోకంలో సకాలలో వానలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలంతా సుఖ-శాంతులు వర్ధిల్లాలని పూజలు చేస్తున్నారు.
వరంగల్ లో వేంచేసిన భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా శాకాంబరి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. చేపట్టిన పనుల్లో విజయం, ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం శాకంబరిగా అమ్మవారిని పూజించాలని పలు పురాణాలు చెబుతున్నాయి.