తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు కట్ట తెగిపోయింది. దాదాపు 250 మీటర్ల మేర కట్టకు గండిపడింది. మూడు గేట్లలో ఒక గేటు తెరుచుకోకపోవడంతో వరద కట్టలు తెంచుకుని గ్రామాలపై పడింది. 15 గ్రామాల ప్రజలు వరద ముంపులో ప్రాణాలు అరచేతపట్టుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని ఒంటిబండ, వేలేరుపాడు, కమ్మరిగూడెం, కొత్తపూచిరాల, అల్లూరినగర్, పాతపూచిరాల, గుళ్లవాయి, వసంతవాడ, సొందిగొల్లగూడెం గ్రామాలు వరదలో మునిగాయి. దాదాపు 10 వేల మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ఓ హెలికాప్టర్‌ను రంగంలోకి దింపారు.
పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగడంతో తెలంగాణలోని అశ్వారావుపేట మండలంలో కోయరంగాపురం, రమణక్కపేట, కొత్తూరు, గుమ్మడవల్లి గ్రామాలకు పాక్షికంగా నష్టం వాటిల్లింది. తెలంగాణలో 3 వేల ఇళ్లు పాక్షికంగా వరద భారిన పడ్డాయి. పంట పొలాలు నీట ముగిగాయి. నష్టం అంచనాలు అందాల్సి ఉంది.