మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి, శుక్రవారం వినుకొండలో పర్యటిస్తారు. నడిరోడ్డు మీద దారుణహత్యకు గురైన తమ పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వైసీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న రషీద్‌ను జిలానీ అనే వ్యక్తి బుధవారం రాత్రి, వినుకొండలో నడిరోడ్డు మీద దారుణంగా నరికి చంపాడు. ఆ వ్యక్తి కూడా వైసీపీకి చెందినవాడే అని తెలుగుదేశం ఆరోపించింది. అతను టిడిపికి చెందిన వాడంటూ వైసీపీ ఫొటోలతో సహా చెబుతోంది. జరిగినది రాజకీయ హత్య అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
బెంగళూరులో ఉన్న జగన్ ఆ సంఘటన గురించి తెలియగానే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. స్థానిక పార్టీ నాయకులంతా రషీద్ కుటుంబ సభ్యులను వెంటనే కలవాలని, వారికి ధైర్యాన్నిచ్చి, తోడుగా నిలవాలనీ నిర్దేశించారు.
‘‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి శ్రీ మోదీగారికి, హోంమంత్రి మంత్రి శ్రీ అమిత్‌షాగారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వైయస్సార్సీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను.’’ అంటూ జగన్ ట్వీట్ చేసారు.