దశాబ్దాల క్రితం కృష్ణా జిల్లాను వీడిన ఉషా పూర్వీకులు
అమెరికా ఉపాధ్యక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా సెనెటర్ జేడీ వాన్స్ ఎంపికైనప్పటి నుంచి ఆయన భార్య ఉష చిలుకూరి పేరు మీడియాలో మార్మోగుతోంది. అమెరికాలోనే కాకుండా భారత్లో ఆమె గురించి చర్చ జరుగుతుంది. అందుకు కారణంగా ఆమె తెలుగింటి ఆడపడుచు కావడమే. ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్.
తొమ్మిది పదుల వయసులోనూ విద్యార్థులకు పాఠాలు చెబుతూ , పరిశోధనలు చేస్తోన్న ప్రొఫెసర్ శాంతమ్మకు ఉష వరుసకు మనవరాలి అవుతారు.
ప్రొఫెసర్ శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి. తెలుగు ప్రొఫెసర్గా సుభ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ళ కిందటే కాలం చేశారు.
సుబ్రహ్మణ్య శాస్త్రి సోదరుడైన రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ శాస్త్రి సంతానమే ఉష. ఉష తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడటంతో ఆమె అక్కడే పుట్టి పెరగారు. దీంతో బంధువర్గంతో ఆమెకు పరిచయాలు తక్కువే. అమెరికా ఎన్నికలు, వాన్స్ అభ్యర్థిత్వం, తమ బంధుత్వం గురించి తెలిశాక పలువురు ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారని ప్రొఫెసర్ శాంతమ్మ తెలిపారు.
చెన్నైలో వైద్యురాలిగా ఉన్న ఉష మేనత్త శారద కూడా వాన్స్- ఉషల వివాహానికి హాజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తమ బంధువులు అమెరికాలో వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు.
ఎన్నికల తరువాత వాన్స్ దంపతులను విశాఖకు ఆహ్వానిస్తామని శాంతమ్మ తెలిపారు. ఇటీవల మతమార్పిడులు ఎక్కువయ్యాయని, హిందువుల సంరక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని ఉషకు సలహా ఇస్తానని శాంతమ్మ పేర్కొన్నారు. 98 ఏళ్ల ప్రొఫెసర్ శాంతమ్మ గతేడాదివరకూ విశాఖ నుంచి విజయనగరంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి పాఠాలు చెప్పేవారు.
ఉష చిలుకూరి మూలాలు ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉన్నాయి. ఉషకు తాత వరుస అయిన చిలుకూరి రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఇక్కడే ఉంటుంది. సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన సంతాన వృక్షంలోనే ఉష ఉన్నారు. ఉష ముత్తాత వీరావధాన్లు, ఆయనకు రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ మూర్తి సంతానం. వీరంతా ఉన్నత విద్యావంతులే.
రామశాస్త్రి ఐఐటీ మద్రాసులో ప్రొఫెసర్ గా పనిచేశారు. . ఆయన భార్య బాలాత్రిపుర సుందరి. వీరికి అవధాని, నారాయణ శాస్త్రి, రాధాకృష్ణ అనే ముగ్గురు కుమారులు శారద అనే కుమార్తె. అన్నదమ్ములు అమెరికాలో స్థిరపడగా.. శారద చెన్నైలో ఉంటున్నారు.
రాధాకృష్ణ ఏరో నాటికల్ ఇంజినీరింగ్ చేసి శాన్డియేగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయన పామర్రుకు చెందిన లక్ష్మిని పెళ్ళి చేసుకున్నారు. వీరి సంతానమే ఉష.