చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి పుంగనూరులో నివాసం ఉంటోన్న మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి వచ్చిన సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నాయి. వైసీపీ కార్యకర్తలు కూడా రెడ్డెప్ప ఇంటి వద్దకు చేరుకుని రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు కూడా రాళ్లదాడికి దిగారు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో ఓ కానిస్టేబుల్, హోం గార్డు గాయపడ్డారు. ఓ కారును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు మిధున్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారు.
ఎన్నికలకు ముందు కుప్పం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును అంగళ్ల వద్ద అడ్డుకున్న సంగతి తెలిసిందే. అంగళ్లలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో 120 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాధరెడ్డి, రాజంపేట వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి, తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా చిత్తూరు జిల్లాలో పర్యటనలు చేయవద్దని పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.