కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీపై వస్తోన్న అపోహలపై టీటీడీ స్పందించింది. థామస్ అనే కాంట్రాక్టర్ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడాన్ని ఖండించిన టీటీడీ, అసత్యాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఎన్నో దశాబ్దాల నుంచి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయానుసారంగా తయారు చేస్తున్నారని పేర్కొంది. తిరుమల శ్రీవారి పోటులో 980 మంది హిందువులు , పోటు కార్మికులు తమకు నిర్దేశించిన వివిధ విధులను నిర్వహిస్తున్నారని వివరించింది.
కార్మికుల్లో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ, ముడి సరుకులు తీసుకురావడం వంటి విధులు నిర్వహిస్తున్నారు. ఇతరలు, లడ్డు ప్రసాదం తరలించడం, ఉగ్రాణం, పడి పోటు, లడ్డు కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్నారని టీటీడీ తెలిపింది.