ఆషాఢమాసం సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గాదేవి ఆలయంలో శాకంబరీ దేవి మహోత్సవాలు రేపటి నుంచి మొదలవుతాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పూర్ణిమ వరకూ అంటే జులై 19, 20, 21 తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని ఆలయ అధికారులు వెల్లడించారు.
ఈ ఉత్సవాల్లో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరిస్తారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేష అలంకరణ చేసి పూజాదికాలు నిర్వర్తిస్తారు. దానివల్ల సకాలంలో వర్షాలు పడి, పంటలు సమృద్ధిగా పండి, రైతులు-ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా జీవిస్తారని భక్తుల విశ్వాసం.
శుక్రవారం ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజ, అంకురార్పణతో శాకంబరీదేవి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆదివారం ఉదయం 9.30కు పూర్ణాహుతితో ముగుస్తాయి. ఈ మూడురోజులూ దుర్గాసప్తశతి, మహావిద్య పారాయణ కార్యక్రమాలు, పలు హోమాలూ నిర్వహిస్తారు.
శాకంబరీ ఉత్సవాల్లో పాల్గొనదలచిన భక్తులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని, వారికి కేటాయించిన స్లాట్లో త్వరగా, సులువుగా దర్శనం చేసుకొనవచ్చు. ప్రత్యక్షంగా గుడికి వెళ్ళలేనివారు ఆన్లైన్లో పరోక్ష సేవలు, పూజలు చేయించుకోవచ్చునని దేవాలయ అధికారులు తెలియజేసారు. కనకదుర్గమ్మ యూట్యూబ్ ఛానెల్లో పూజాది కార్యక్రమాలను చూడవచ్చని వెల్లడించారు.