ఇటీవల వివాదాస్పదమైన ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్‌ను పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఆమెను నిర్బంధించారు.
మనోరమ ఖేద్కర్ ఒక రైతును ఆమె తుపాకితో బెదిరిస్తున్న వీడియో కొద్దిరోజుల క్రితం వైరల్ అయింది. పుణే జిల్లా ముల్షీ గ్రామంలో ఒక భూవివాదంలో ఆమె స్థానిక రైతులతో తీవ్రంగా గొడవపడ్డారు. ఆ సందర్భంగా తన దగ్గరున్న తుపాకిని ఒక రైతుమీద ఎక్కుపెట్టి చంపేస్తానని బెదిరించారు. ఒక భూమి తన పేరు మీద ఉందని మనోరమ వాదిస్తుంటే ఒక రైతు దానికి సంబంధించిన పత్రాలు చూపించాలని డిమాండ్ చేసారు. కోపం పట్టలేని మనోరమ అతన్ని తుపాకితో బెదిరించారు. అయితే ఆ వ్యవహారాన్ని ఎవరో రికార్డ్ చేస్తున్నారని గమనించి, వెంటనే తుపాకిని దాచిపెట్టేసారు. ఆ వీడియో విస్తృత ప్రాచుర్యం పొందడమే కాదు, దాన్ని చూసిన ప్రజలు ఆమె ప్రవర్తనను తప్పుపట్టారు.
వైరల్ వీడియోను చూసిన పోలీసులు రంగంలోకి దిగారు. మనోరమా ఖేద్కర్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అయిన ఆమె భర్త దిలీప్ ఖేద్కర్‌ను కూడా ఎఫ్ఐఆర్లో సహనిందితుడిగా చేర్చారు. రాయగఢ్ జిల్లా రాయగఢ్ కోట సమీపంలోని ఒక లాడ్జ్‌లో దాగిఉన్న మనోరమను పుణే పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేసారు.
దిలీప్ ఖేద్కర్ మీద కూడా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వోద్యోగంలో ఉన్నప్పుడు రెండుసార్లు సస్పెండ్ అయ్యారు. లంచాలు వసూలు చేస్తున్న ఆరోపణల మీద 2018, 2020 సంవత్సరాల్లో ఆయనపై రెండుసార్లు సస్పెన్షన్ వేటు పడింది.
పూజా ఖేద్కర్ వివాదాస్పద ప్రవర్తనతో ఆమె కుటుంబం కథ వెలుగులోకి వచ్చింది. 2023 యుపిఎస్సి పరీక్షలో 841వ ర్యాంక్ తెచ్చుకున్న పూజా, ఇంకా శిక్షణ దశలో ఉండగానే తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత తన యుపిఎస్సి అభ్యర్ధిత్వంలో తప్పుడు వివరాలు సమర్పించారన్న ఆరోపణలు వెలుగు చూసాయి.
పూజ ఒబిసి కానప్పటికీ యుపిఎస్సి దరఖాస్తులో ఆ రిజర్వేషన్ పెట్టుకున్నారని ఆరోపణలున్నాయి. అలాగే తను శారీరకంగా, మానసికంగా వికలాంగురాలినని కూడా ఆ దరఖాస్తులో పేర్కొన్నారట. ఇంక, ట్రైనీ ఐఎఎస్ దశలో ఉండగానే విఐపి నెంబర్ప్లేట్లు వాడడం, సొంత ఆడీ సెడాన్ కారుపై ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకోవడం, ఎర్రబుగ్గ పెట్టించుకోవడం వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అంతేకాదు, పూజా ఖేద్కర్ పేరు మీద మహారాష్ట్రలో ఐదు ప్లాట్లు, రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయని తేలింది. వాటి విలువ 22 కోట్లు. దాంతో ఆ కుటుంబం ఆర్థిక వ్యవహారాల మీద కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి.