ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా మండిమర్క అటవీ ప్రాంతంలో ఐఈడీ పేల్చారు. దీంతో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా నలుగురు కానిస్టేబుళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాలు గాలింపు చర్యల్లో పాల్గొని తిరిగి వస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారని ఉన్నతాధికారులు వివరించారు. స్టేట్ టాస్క్ఫోర్సుకు చెందిన చీఫ్ కానిస్టేబుల్ భరత్ లాల్ సాహూ, కానిస్టేబుల్ సాతెర్ సింగ్ మృతిచెందినట్లు అధికారికంగా వెల్లడించారు. పురుషోత్తమ్ నాగ్, కోమల్ యాదవ్, సియారామ్ సోరి, సంజయ్ సింగ్ అనే కానిస్టేబుళ్ళు గాయపడ్డారని వారంతా జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మెరుగైన చికిత్స కోసం వారిని రాయ్‌పూర్‌కి తరలించనున్నారు.
దండకారణ్యం లో బుధవారం నాడు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఓ ఎస్సై, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ తెలిపారు.
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా పరిధిలోని వండోలి గ్రామ సమీపంలో సుమారు 15 మంది మావోయిస్టులు ప్రచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు గాలింపు చర్యలకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఐదు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి.ఘటనా స్థలంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలు, మూడు ఏకే-47లు, రెండు ఇన్సాస్లు, ఒక కార్బైన్, ఎస్ఎల్ఆర్, ఇతర వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.