కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేసింది. దానిపై మరింత అధ్యయనం చేస్తామని ప్రకటించింది. సోమవారం రాష్ట్ర శాసనసభ పాస్ చేసిన ఆ బిల్లు అమల్లోకి వస్తే, కర్ణాటకలోని ప్రైవేటు ఉద్యోగాల్లో నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 70శాతం, మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50శాతం స్థానికులకే కేటాయించాల్సి వస్తుంది.
‘‘కన్నడిగులకు ప్రైవేటు సంస్థల ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన బిల్లు ఇంకా తయారీ దశలోనే ఉంది. తదుపరి క్యాబినెట్ సమావేశంలో సమగ్ర చర్చ జరిగాక తుది నిర్ణయం తీసుకుంటాము’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ‘ఎక్స్’లో ట్వీట్ చేసారు.
ముఖ్యమంత్రి ఈ కోటా గురించి తొలుత మంగళవారం సాయంత్రం ఎక్స్‌లోనే ప్రకటించారు. తమది కన్నడిగుల అనుకూల ప్రభుత్వమనీ, వారికి మాతృభూమిలో సౌకర్యంగా జీవించే అవకాశం కల్పిస్తామనీ, సొంతగడ్డ మీద ఉద్యోగాలు లేని పరిస్థితి లేకుండా చేస్తామనీ సిద్దరామయ్య ట్వీట్ చేసారు. కొన్ని స్థాయుల ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు.
వ్యాపార వాణిజ్య రంగాల వారు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాజకీయ ప్రత్యర్ధి బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి ముందు తన ట్వీట్‌ను తొలగించారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ కూడా వివరణ ఇచ్చారు.