అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ పడుతున్న జెడి వాన్స్ ఇంగ్లండ్‌లో తాజా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంగ్లండ్, అణ్వాయుధాలు కలిగిన మొట్టమొదటి నిజమైన ఇస్లామిక్ దేశంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
రెండురోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అణ్వాయుధాన్ని సాధించగల మొదటి నిజమైన ఇస్లామిక్ దేశం ఏది అన్న అంశం మిత్రులతో చర్చలో వచ్చిందని జెడి వాన్ చెప్పారు. ‘‘అది ఇరాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, మరేదైనా దేశం కావచ్చు. కానీ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ స్థానాన్ని యునైటెడ్ కింగ్డమ్ సాధించిందని మేం అనుకున్నాం’’ అని వాన్ వివరించారు.
వాన్ కామెంట్లను బ్రిటన్ ఉపప్రధానమంత్రి ఏంజెలా రేనర్ పెద్దగా పట్టించుకోలేదు. అలాంటి విచిత్రమైన వ్యాఖ్యలు చేయడం వాన్స్‌కు అలవాటేనంటూ కొట్టిపడేసారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో గెలిచే అధ్యక్షుడితో తాము కలిసి పనిచేస్తామని రేనర్ చెప్పుకొచ్చారు. బ్రిటన్ పరిపాలన విషయంలోనే తమకు ఆసక్తి అనీ, అంతర్జాతీయ మిత్రులతో కలిసి పనిచేస్తామనీ ఆమె వివరించారు.
రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎన్నికైన తర్వాత జెడి వాన్, అమెరికాకు అతిపెద్ద ముప్పు చైనా అని వ్యాఖ్యానించారు. ఒహాయో రాష్ట్ర సెనేటర్ అయిన వాన్, ట్రంప్ గెలిస్తే మొట్టమొదటగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేసేలా రష్యాతో చర్చలు జరుపుతారని చెప్పారు. తద్వారా నిజమైన సమస్య అయిన చైనాపై వీలైనంత వేగంగా దృష్టి సారించడం సాధ్యమవుతుందన్నారు.