కేరళ సంప్రదాయ పంచాంగం ప్రకారం వచ్చే ‘కర్కిడకం’ మాసాన్ని మళయాళీలు రామాయణ మాసంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం రామాయణ మాసం జులై 16న మొదలై ఆగస్టు 16న ముగుస్తోంది.
ఈ మాసంలో ఏం చేస్తారంటే….
హిందువుల పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఈ మాసం అంతా మళయాళీలు భక్తిశ్రద్ధలతో పారాయణం చేస్తారు. కర్కిడక మాసం ఆఖరి రోజుతో పారాయణం పూర్తవుతుంది. ఇళ్ళలోనే కాదు, విష్ణుమూర్తి దేవాలయాల్లోనూ పారాయణాలు జరుగుతాయి.
అంతేకాదు, ఈ పవిత్ర మాసంలో హిందువులు ‘నలంబళ దర్శనమ్’ చేసుకుంటారు. అంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల దేవాలయాలు నాలుగింటినీ దర్శించుకుంటారు. సాధారణంగా మనకు తెలిసినంతవరకూ రాముడికే గుడులు ఉంటాయి. ఇంకా, రామ పరివారంలో లక్ష్మణుడు ప్రధానంగా ఉంటాడు. రామ పట్టాభిషేకం చిత్రపటాల్లో నలుగురు సోదరులూ కనిపిస్తారు. కానీ కేరళలోని కొట్టాయం, త్రిశూర్ జిల్లాల్లో నలుగురు సోదరులకూ నాలుగు దేవాలయాలు ఉన్నాయి. ఆ నాలుగింటినీ ఒకేరోజులో దర్శించుకుంటారు.
కర్కిడక మాసం అమావాస్య రోజున కుటుంబంలోని దివంగత సభ్యులకు శ్రాద్ధకర్మలు ఆచరించడం కేరళీయుల ఆచారం. దానివల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని విశ్వసిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంతో సరిపోలే కర్కిడక మాసం మళయాళీలకు కూడా శూన్య మాసమే. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, కొత్తపనుల ప్రారంభం వంటివి ఈ మాసంలో చేయరు.
ఈ మాసం మరో ప్రత్యేకత ఏంటంటే.. ఆయుర్వేద వైద్య చికిత్సలు. చాలామంది మళయాళీలు ఈ నెలలో కర్కిడక కంజి అనే మూలికల సమ్మిశ్రణాన్ని సేవిస్తారు.
కర్కిడకం పూజ: శబరిమల ఆలయం
ఈ మాసంలో నిర్వహించే కర్కిడకం పూజ కోసం శబరిమల ఆలయాన్ని సోమవారం తెరిచారు. ఐదు రోజుల పాటు, అంటే శుక్రవారం వరకూ పూజలు జరుగుతాయి. కలశాభిషేకం, లక్షార్చన, సహస్రకలశ పూజ, ఉదయాస్తమాన పూజ, అష్టాభిషేకం, పుష్పాభిషేకం, పడిపూజ వంటి కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. ఐదురోజుల కర్కిడకం పూజల తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు.