కర్ణాటకలోని ప్రైవేటు కంపెనీల్లో సి, డి గ్రూప్ ఉద్యోగాల్లో కన్నడిగులకే 100 శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటన చేసారు. ఆ అంశంపై వివాదం చెలరేగడంతో సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్ట్‌ను డిలీట్ చేసారు.
మంగళవారం కర్ణాటక క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కన్నడిగులకు ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి నిర్ణయం తీసుకున్నారు. సి, డి గ్రూప్ ఉద్యోగాలు మొత్తం కన్నడిగులకే ఇవ్వాలని ఆదేశించారు. దాన్నే ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఆ నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఫాసిస్టు, వివక్షాపూరితమైన చర్య అంటూ మండిపడ్డాయి. కర్ణాటక పారిశ్రామిక ప్రగతిలో గణనీయమైన స్థాయికి కారణమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల అధిపతులు ఆ నిర్ణయాన్ని తిరోగామి చర్యగా అభివర్ణించారు.
‘‘ఈ బిల్లు వివక్షాపూరితం, ప్రగతి నిరోధకం, ఫాసిస్టు చర్య, గందరగోళం’’ అని మోహన్‌దాస్ పయ్ స్పందించారు. కర్ణాటక అసోచామ్ కోఛైర్మన్ ఆర్కె మిశ్రా ఆ నిర్ణయాన్ని హ్రస్వదృష్టితో తీసుకున్న నిర్ణయంగా వ్యాఖ్యానించారు. పరిశ్రమలు, సంస్థలను భయపెడుతుందన్నారు. ‘బయోకాన్’ కిరణ్ మజుందార్ షా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఈ విధానం నుంచి ఉన్నతస్థాయి నైపుణ్యం గల ఉద్యోగాలను మినహాయించాలని కోరారు.
పరిశ్రమ నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. సిద్దరామయ్య తన వివాదాస్పద ట్వీట్ తొలగించారు.
ప్రైవేటు సంస్థల్లో నాన్-మేనేజ్మెంట్ తరహా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 70శాతానికీ, మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50శాతానికీ పరిమితం చేస్తామని కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ వివరించారు. కంపెనీలు సరైన నైపుణ్యాలు కలిగిన అభ్యర్ధులను ఈ విభాగం నుంచి ఎంచుకోలేకపోతే, వారు రాష్ట్రం బైటినుంచి ఉద్యోగులను చేర్చుకోవచ్చని వివరించారు. అయితే రాష్ట్రంలో ప్రతిభావంతులకు లోటు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు కర్ణాటకలో కుప్పలుతెప్పలుగా ఉన్నారు. కర్ణాటకలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు, వైద్య కళాశాలలు, అంతర్జాతీయ పాఠశాలలు… ఇలా ఎన్నో సంస్థలున్నాయి. వాటిలో 70శాతం ఉద్యోగాలు కన్నడిగులకు మాత్రమే ఉంచాలని కోరుతున్నాం. తగినంత ప్రతిభ రాష్ట్రంలో లేకపోతే, అప్పుడు బైటి రాష్ట్రాల నుంచి తీసుకోచ్చు’’ అని సంతోష్ లాడ్ వివరించారు.
ఈ విషయంలో గందరగోళం, అయోమయాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని కర్ణాటక వాణిజ్యం, పరిశ్రమల మంత్రి హెచ్బి పాటిల్ చెప్పారు. నిరంతర పోటీ ప్రపంచంలో కర్ణాటక మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతూనే ఉంటుందన్నారు.