మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా జూలై 24న తిరుమలలో పల్లవోత్సవం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.
సహస్రదీపాలంకారసేవ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామిని సేవించుకుంటారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుంచి తిరుమలలో ఈ సేవ జరుగుతోంది.దీనినే తోటోత్సవం అనికూడా పిలుస్తారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడైన మైసూరు మహారాజు తిరుమలకు భారీ కానుకలు సమర్పించారు. బ్రహ్మోత్సవాలు, ఇతర పర్వదినాల్లో ఉపయోగించే గరుడ, గజ, ముత్యపుపందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలను ఆయనే సమర్పించారు. పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో తయారు చేయించారు.
సుప్రభాతసేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీతహారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి, మహారాజ దీపానికి ప్రతిరోజూ 5 కేజీల నెయ్యి అందజేసే సంప్రదాయం మైసూర్ మహారాజు హయాంలోనే ప్రారంభించారు.
మైసూరు మహారాజు జ్ఞాపకార్థం ప్రతీనెలా ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు.శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీమలయప్పస్వామివారు కర్ణాటక సత్రాలకు వేంచేస్తారు.