ముంబై విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ లోడర్ ఉద్యోగాలకు మంగళవారం రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. 2216 ఉద్యోగాలకు వాకిన్ ఇంటర్వ్యూ పెడితే, 25వేలకు పైగా అభ్యర్ధులు హాజరయ్యారు. వారిని నిలువరించడానికి ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సిబ్బంది నానా తంటాలూ పడ్డారు.
భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను ఎయిర్ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సంస్థ నిర్వహిస్తోంది. అందులో లగేజీని లోడింగ్, అన్లోడింగ్ చేసే వారిని లోడర్స్ అని పిలుస్తారు. ఒక్కో విమానానికి కనీసం ఐదుగురు లోడర్స్ కావాల్సి ఉంటుంది. వారికి నెల జీతం 20 నుంచి 25వేల వరకూ ఉంటుంది. ఓవర్‌టైం ఎలవెన్సులు తదితరాలతో కలిసి 30వేల వరకూ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఆ ఉద్యోగానికి ప్రాథమిక స్థాయి విద్యార్హతలు ఉండాలి, కాకపోతే శారీరకంగా దృఢంగా ఉండడం తప్పనిసరి.
మంగళవారం జరిగిన రిక్రూట్మెంట్ డ్రైవ్‌కి 25వేల మందికి పైగా హాజరయ్యారు. సుమారు 500 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అభ్యర్ధులు ఉద్యోగం కోసం వచ్చారు. గంటల తరబడి క్యూల్లో నిలబడి అలసిసొలసిపోయారు. తిండి, ఆహారం లేకపోవడంతో కొంతమంది సొమ్మసిల్లిపోయారు.
కొద్దిరోజుల క్రితం గుజరాత్ భరూచ్ జిల్లాలోని అంకలేశ్వర్‌లో ఒక ప్రైవేటు కంపెనీలో 10 ఉద్యోగాల కోసం వాకిన్ ఇంటర్వ్యూ కోసం నిర్వహించారు. ఆ ఉద్యోగం కోసం సుమారు 2వేల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వారి తోపులాటలో ఆ కార్యాలయం ఆవరణలోని ర్యాంప్కున్న రైలింగ్ కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ ర్యాంప్ మరీ ఎత్తు లేకపోవడం వల్ల ఎవరికీ పెద్దగా దెబ్బలు తగల్లేదు.
ఈ సంఘటనలను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్ళ ఎన్డీయే పాలనలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్యోగాలు లేనివారు రష్యా, ఇజ్రాయెల్‌లో యుద్ధాలు చేయడానికి సైతం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారంటూ మండిపడ్డారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు