తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి కావడంతో దేవతామూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు భగవంతుడి నామస్మరణ చేస్తున్నారు.
సనాతన ధర్మాన్ని ఆచరించే వారికి ఏడాదిలో మొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ రోజు నుంచే వినాయక చవితి, విజయదశమి, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ జీవన విధానంలో తొలి ఏకాదశికి ప్రత్యేక స్థానముంది. దీనినే ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా ఆయా ప్రాంతాల్లో పిలుస్తారు.
ఒక ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తారు. ప్రబోధినీ ఏకాదశి నాడు ఆయన తిరిగి మేల్కొంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నే చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు.. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి జనబాహుళ్యంలో బాగా ప్రాచుర్యంలో ఉంది.
కృతయుగంలో మురాసురుడనే అసురుడు, బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడనే పురాణగాథ కూడా ఉంది. అతడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పాటు పోరాడతారు. అలసిపోయి ఓ గుహలో సేదతీరుతుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందని కూడా పలు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. అందుకు ప్రతిఫలంగా కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందని నాటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చిందనే కథ కూడా ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి ‘ఏకాదశి’ వ్రతం ఆచరణ ప్రారంభమైంది.
ఏకాదశి మరుసటి రోజైన ద్వాదశి నాడు దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. నేడు గోమాతను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి అని పురణాల్లో పేర్కొన్నారు. పేలాల పిండిని తప్పక తినడం మంచిదని, తద్వారా పితృదేవతలు ప్రీతి చెందుతారని సనాతనుల నమ్మకం.
జగన్నాథ స్వామిని నేడు స్వర్ణాలంకృతునిగా అలంకరిస్తారు. దీనినే ‘సునా బేషొ’ అంటారు. ఈ వేషధారణనను ‘రాజాధిరాజ వేషం’ అని కూడా పిలుస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతా విగ్రహాలకు బంగారు కాళ్లు, చేతులు, ముఖాలకు బంగారు ఊర్థ్వపుండ్రాలు అలంకరిస్తారు. జగన్నాథుడి కిరీటంపై బంగారు నెమలి పింఛాన్ని కూడా అలంకరించడం అనాయితీ.