అంతర్జాతీయంగా, దేశీయంగా అందిన సానుకూల సంకేతాలతో మూడో రోజూ దేశీయ స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడుతోన్న సమయంలో స్టాక్ సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. చివర్లో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనైనా జీవితకాల గరిష్ఠ రికార్డును నమోదు చేశాయి.
ఉదయం ప్రారంభంలో సెన్సెక్స్ లాభాలతో మొదలైంది. ఇంట్రాడేలో గరిష్ఠంగా 80898 పాయింట్లను తాకింది. చివరకు 51 పాయింట్ల లాభంతో 80716 వద్ద క్లోజైంది. నిఫ్టీ 26 పెరిగి 24613 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభపడ్డాయి. రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నష్టాలను చవిచూశాయి. ముడిచమురు ధర స్వల్పంగా పెరిగింది. బ్యారెల్ 84.23 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గోల్డ్ స్వల్పంగా పెరిగి ఔన్సు 2446 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.